సమయం సంపద
మనిషి తనకు ఇష్టమైన పని అయితే ఎంత సమయమైనా వెచ్చిస్తాడు. ఇష్టం కాని పనిని కష్టంగా భావించి అసలు సమయమే కేటాయించడు. జీవితం ఎంతో అమూల్యమైంది. సమయం అంతకు మించి విలువైంది.
Published : 01 Mar 2024 00:15 IST
తాత్కాలిక భోగలాలసతకు, విలాసాలకు బానిసలైనవాళ్లు సమయాన్ని పట్టించుకోరు. జీవితంలోని అమూల్య క్షణాలను జారవిడుచుకుంటున్నామన్న సత్యాన్ని గ్రహించలేరు. వార్ధక్యంలో అటువంటివాళ్లకు మిగిలేది పశ్చాత్తాపమే.
‘కష్టాలొచ్చినప్పుడే కరుణా సింధువును శరణు వేడుతాం. సుఖశాంతులు ఉన్నప్పుడే, జవసత్వాలు ఉన్నప్పుడే జగత్పతిని స్మరిస్తే కష్టాలే రావు కదా!’ అంటాడు ప్రాచీన హిందీ భక్తకవి కబీర్దాసు. ఏ క్షణాన ఏ మార్పును చూస్తామో తెలియదని సాగర కెరటమే చెబుతోంది. ‘లెక్కించే వాటిలో కాలాన్ని నేను’ అన్నాడు గీతాచార్యుడు. మనిషి సర్వదా లక్ష్యపెట్టాల్సింది కాలాన్నే అని అర్థం.
పూర్వం రుషులు, యోగులు, కవులు, అవధూతలు సమయాన్ని స్వాధీనంలో ఉంచుకోవడం వల్లనే జాతికి అమృతభాండంలాంటి జ్ఞాన భాండాగారాన్ని అందించగలిగారు. సమ్మతికైనా, దుర్మతికైనా ఒక క్షణం చాలు- యశోశిఖరాగ్రానికి చేరడానికి, అథఃపాతాళానికి పడిపోవడానికి. ఖ్యాతికి, అపఖ్యాతికి బీజం సమయమే.