రుబ్బిన ఇడ్లీ/దోసె పిండిని ఎన్ని రోజులు వాడచ్చు
సమయం లేకనో, పదే పదే చేయడానికి ఓపిక లేకనో.. ఒకేసారి వారానికి సరిపడా ఇడ్లీ, దోసె పిండిని రుబ్బి ఫ్రిజ్‌లో పెట్టుకోవడం మనలో చాలామందికి అలవాటే! అయితే ఎలాగూ ఫ్రిజ్‌లోనే ఉంది కదా.. ఎన్ని రోజులైనా పిండి తాజాగానే ఉంటుందనుకుంటాం.. కానీ ఫ్రిజ్‌లో ఉన్నప్పటికీ ఈ పిండిని రోజుల తరబడి ఉపయోగించడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల పిండి ఎక్కువగా పులిసి లేనిపోని అనారోగ్యాలు తప్పవంటున్నారు. మరి, రుబ్బుకున్న ఇడ్లీ, దోసె పిండి ఎక్కువగా పులియకూడదంటే ఏం చేయాలి? దీన్ని ఎన్ని రోజులు వాడచ్చు? తెలుసుకుందాం రండి..
పులియబెట్టిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివన్న విషయం తెలిసిందే! అలాగని ఇవి అతిగా పులిసినా ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు నిపుణులు. తద్వారా అందులోని పోషకాలు నశించిపోవడంతో పాటు ఆ పదార్థం రుచి, వాసన.. రెండూ కోల్పోతాయంటున్నారు. ఇడ్లీ/దోసె పిండి కూడా అంతే! వీటిని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల పులిసే ప్రక్రియ ఆగిపోతుందని, అందుకే అవి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయనుకుంటారు చాలామంది. కానీ ఫ్రిజ్‌లో పెట్టినా పులిసే ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతుందని, ఇదే పదార్థాన్ని లోలోపల పాడైపోయేలా చేస్తుందని చెబుతున్నారు.
అసలెందుకిలా?
వాతావరణం వేడిగా ఉన్నప్పుడు రాత్రంతా పిండిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే దానంతటదే పులుస్తుంది. అదే చల్లగా ఉన్నప్పుడు పిండి పులియడం కోసం ముందే కాస్త బేకింగ్ సోడా కలుపుతుంటారు కొంతమంది. అయితే పులిసే ప్రక్రియలో భాగంగా ఇలాంటి పదార్థాలు విడుదల చేసే అధిక వాయువుల వల్ల కూడా పిండి ఎక్కువగా పులిసే ప్రమాదం ఉందని, తద్వారా దాని టెక్స్చర్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువంటున్నారు నిపుణులు. అదే ఈస్ట్ కలిపి పులియబెట్టే పదార్థాల్ని ఎక్కువ సమయం బయటే ఉంచడం వల్ల అవి అధికంగా పులియడంతో పాటు, వాటి రుచి, చిక్కదనంలోనూ తేడాలొచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ పిండి టెక్స్చర్‌ని బట్టి అది ఎక్కువగా పులిసిందా? సాధారణంగానే పులిసిందా? అనే విషయాలు తెలుసుకోవచ్చంటున్నారు. పిండి మరీ చిక్కగా మారినా, మరీ పల్చగా మారినా.. ఎక్కువగా పులిసినట్లు భావించాలని.. ఇలాంటి పిండితో ఇడ్లీ/దోసె.. వంటివి చేసినప్పుడు.. అవి గట్టిగా మారడం, రుచించకపోవడం.. వంటివి గమనించచ్చంటున్నారు.
జీర్ణ సమస్యలు తప్పవట!
అయితే ఇలా అతిగా పులిసిన పిండిని తీసుకోవడం వల్ల కడుపులో మంట, అజీర్తి, ఇన్ఫెక్షన్.. వంటి జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. కాబట్టి టెక్స్చర్‌లో మార్పులతో పాటు.. నోటికి పుల్లగా తగిలినా, వాసనలో తేడాలొచ్చినా, పిండి ఉపరితలంపై నూనెలాంటి లేయర్ ఏర్పడినా.. ఇలాంటి పిండిని బయటపడేయడమే ఉత్తమం. అందుకే పిండి రుబ్బిన 24 గంటల్లోనే దాన్ని పూర్తిగా వాడేయాలని, ఎప్పటికప్పుడు తాజాగా వీటిని తయారుచేసుకోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం అంటున్నారు.
ఎక్కువగా పులియకుండా!
ఇడ్లీ/దోసె పిండి అధికంగా పులియకుండా ఈ చిట్కాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
⚛ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పిండి నాలుగ్గంటల్లోనే పులిసే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రంతా బయటే ఉంచకుండా.. మధ్యమధ్యలో చెక్ చేయాలి. అదే చల్లగా ఉన్నప్పుడు గంటలు గడిచినా అది పులవదు. ఈ క్రమంలో పిండి రెండింతలైందంటే అది చక్కగా పులిసినట్లు లెక్క అని గుర్తుపెట్టుకోండి. అప్పుడు తీసి ఫ్రిజ్‌లో పెట్టేస్తే సరిపోతుంది.
⚛ కొంతమంది పిండి ఫ్రిజ్‌లో పెట్టడం మర్చిపోతుంటారు. దీనివల్ల కూడా ఎక్కువగా పులిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలారం/టైమర్ సెట్ చేసుకొని.. చెక్ చేసి మరీ పిండిని ఫ్రిజ్‌లో పెట్టాలి.
⚛ ఉప్పు ఎక్కువగా వాడడం వల్ల కూడా పిండి అధికంగా పులుస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తపడడం మంచిది. అలాగే అవసరమైనంత పిండిలోనే ఉప్పు కలుపుకొని ఉపయోగించడం మేలు!
⚛ పిండి బాగా చల్లగా ఉందనో లేదంటే దోసెలు వేయాలనుకున్న ప్రతిసారీ తీసి బయటపెట్టడం ఎందుకనో.. కొంతమంది నిద్ర లేవగానే ఈ బ్యాటర్ గిన్నెను ఫ్రిజ్‌లో నుంచి తీసి బయటపెట్టేస్తారు. దీనివల్ల కూడా ఎక్కువగా పులిసే ప్రమాదం ఉంది. కాబట్టి అవసరమున్నప్పుడే పిండిని ఫ్రిజ్‌లో నుంచి తీయడం మంచిది.
⚛ మోతాదుకు మించి మినప్పప్పు ఉపయోగించినా పిండి ఎక్కువగా పులిసే అవకాశం ఉంటుందట! ఎందుకంటే మినప్పప్పు పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా వేయకుండా మోతాదులో వాడేలా జాగ్రత్తపడాలి.
⚛ మెంతులు కూడా పులిసే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. కాబట్టి వీటిని కూడా ఎక్కువగా వాడకపోవడం మంచిది.